చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన.. ఎన్టీఆర్ ఘాట్‌లో బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి దీక్ష..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నిరసనకు దిగారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నిరసనకు దిగారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న మోత్కుపల్లి.. ముందుగా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష చేపట్టారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని మోత్కుపల్లి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం కొంతసేపు మాత్రమే దీక్ష చేయడానికి అనుమతించినట్టుగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను మేధావులు ఖండించాలని కోరారు. ఏ ఆధారంతో చంద్రబాబును అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమని అన్నారు. చంద్రబాబుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు 4 సీట్లు కూడా రావని చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే, శనివారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారు.. ఈ అరెస్ట్‌ను ఆయన ఖండించాలని అన్నారు. రాజకీయాలు వేరని.. ఇష్యూను కేసీఆర్ ఖండించాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం కోసం పోరాటం చేశారు.. కానీ ఇంతా దుర్మార్గపు పాలన చేయలేదని.. జగన్ ఏం బటన్‌లు ఒత్తుతున్నాడో.. ఎవరికి ఏం వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు.
‘‘ఇదే ఘాట్ నుంచి 2018 ఎన్నికల సమయంలో జగన్ గెలవాలని మాట్లాడాను. నా మాటల వల్ల దళిత వర్గాలు, పేద వర్గాలు ఏకమై జగన్‌ను గెలిపించాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి మైకంలోకి వెళ్లిపోయాడు. ఆ మైకం ఎంతరవకు వెళ్లిందంటే.. తల్లిని ఇంటి నుంచి బయటకు పంపించాడు. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన ముగించిన పాదయాత్రను కొనసాగించి, అన్నకు అసరాగా నిలిచిన చెల్లను మెడపట్టి బయటకు గెంటాడు. సీఎం జగన్ రాజధాని లేని రాజ్యం నడిపిస్తున్నాడు. దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది.. కానీ జగన్ పరిపాలించే రాష్ట్రంలో రాజధానే లేదు. యువకుడు ఉత్సాహంగా ఉన్నాడని, మంచి పరిపాలన ఉంటుందని నమ్మి ప్రజలు 151 సీట్లు ఇస్తే ఆయన అహంకారంతో ఉన్నారు. ప్రజల ఆశలకు భిన్నంగా జగన్ పాలన ఉంది.
ఏపీలో మాట్లాడిన వాళ్లను కొట్టి, తిట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు దీనిని అర్థం చేసుకోవాలి. గతంలో ఎన్డీయే కన్వీనర్‌గా, వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జైలులో పెట్టి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారు. జగన్ రాజ్యం ఎల్లకాలం ఉంటుందా?. 2021లో కేసు బుక్ అయింది.. ఆ కేసులో ఉన్నవాళ్లంతా బెయిల్ మీద బయట ఉన్నారు. ఆధారాలు లేకుండా, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబు వంటి పెద్దనాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించారు.
చంద్రబాబు చేతుల గుండా రూ. 7-8 లక్షల బడ్జెట్ పాస్ అయింది. ప్రతి ఏడాది ఒక్కటిన్నర లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశారు. అలాంటింది ముష్టి రూ. 371 కోట్లకు ఆయన దిగజారుతాడా?. జగన్‌కు ఏమైనా సిగ్గు, బుద్ది ఉందా?. చంద్రబాబు ఏనాడూ కక్ష సాధింపులకు పాల్పడలేదు. చంద్రబాబు క్రిమినల్ కాదు. కొంతమందికి ఇబ్బందులు జరగొచ్చు. వ్యక్తులనే లేకుండా చేయాలనే జగన్‌కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నాలుగేళ్లు జగన్ ఏం చేశాడు?. ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనక ఉద్దేశం ఏమిటి?. వెంటనే చంద్రబాబు నాయుడు వయసుకు విలువనిచ్చి జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును జగన్ సరిచేసుకోవాలి.
జగన్ ఎస్సీల బిడ్డ కాదు.. రాజధాని లేకుండా చేసినందుకు ప్రజల బిడ్డ కాదు.. తల్లిని దూరం పెట్టినందుకు తల్లి బిడ్డ కాదు. చంద్రబాబు దోమలు కుడుతున్నాయని చెబుతున్నారు.. ఆయన చనిపోతే ఎలా?. చంద్రబాబు చనిపోతే జగన్‌దే బాధ్యత. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. మాస్క్‌లు అడిగినందుకు నా మిత్రుడి అల్లుడైన సుధాకర్‌పై రాక్షస గుణం చూపించారు. పిచ్చోడని ముద్ర వేసి జైలులో వేసి చంపారు. దళితుల గుండె పగిలిపోయింది. జగన్ నాటకాలు ప్రజలకు అర్థం అయ్యాయి. జగన్ మాటలు వినడానికి ఎవరూ సిద్దంగా లేరు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను చంపితే జగన్ ఎందుకు మాట్లాడలేదు. ఏపీలో దళితులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి.
చంద్రబాబు ఏమైనా నేరస్థుడా?. 15 ఏళ్లు ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానించడం ప్రజాస్వామ్యానికి ముప్పు. చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలి. నేను రాజమండ్రికి వెల్లి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను. అవకాశం కుదిరితే చంద్రబాబును కూడా కలిసి వస్తాను. ఏపీలో రౌడీ రాజ్యం ఉండాలా? అనేది ఆలోచన చేయాలి. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రేపు ఒకరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేయబోతున్నాను. నేను బీఆర్ఎస్‌లో ఉన్నానని.. అయితే రాజకీయాలకు అతీతంగా మానవత్వ హృదయంతో మాట్లాడుతున్నాను’’ అని మోత్కుపల్లి పేర్కొన్నారు.