అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయన రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ రాజకీయాలను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోరనీ, రాజకీయ పార్టీని నడపడానికి బదులు ఎన్జీవోను ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరుఫున రాహుల్ గాంధీ ప్రచారం చేయకుండా.. తనకేం సంబంధం లేనట్టు భారత్ జోడోలో పాల్గొన్నారని, ఈ విషయాన్ని బట్టే.. రాజకీయాల పట్ల రాహుల్ గాంధీకి సీరియస్‌నెస్ లేదనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. కాంగ్రెస్ అధినేత సీరియస్ రాజకీయాలు చేయకుండా అమెరికాలో ‘మొహబ్బత్ కీ దుకాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారని రాహుల్ గాంధీని తప్పుబట్టారు.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మంగళవారం (మే 31) కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిర్వహించిన 'మొహబ్బత్ కీ దుకాన్' కార్యక్రమంలో పాల్గొని.. మైనారిటీలు, దళితులు, గిరిజనులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై ఏమంటారంటే?
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..బీజేపీ వైఫల్యం వల్లే కాంగ్రెస్ విజయం సాధించిందనీ, ఈ విజయంలో కాంగ్రెస్ పాత్రేమీ లేదని అన్నారు. బీజేపీ అసమర్థత,అవినీతిని కర్ణాటక ప్రజలు తిరస్కరించారని, ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని అన్నారు. భారతదేశానికి ఎంపిక అవసరం, తిరస్కరణ కాదు. అయితే, దురదృష్టవశాత్తు.. కర్ణాటక ప్రజలకు అవకాశాలు తక్కువగానే మిగిలాయని అన్నారు. తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు చూపించడమే బీఆర్‌ఎస్ ఎజెండా అని కేటీఆర్ అన్నారు. గత 70 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, అలాగే.. ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ తన పాత్రను నిర్వహించడం లేదని విమర్శించారు.
