Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ హైకోర్టు తీర్పుపై సవాల్: సుప్రీంను ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి


తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో  బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  సోమవారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

BRS Leader Bandla Krishna Mohan Reddy Files petition in Supreme Court against Telangana High Court  Verdict lns
Author
First Published Sep 4, 2023, 9:55 AM IST

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై  తెలంగాణ హైకోర్టు  అనర్హత వేటేసింది.ఈ ఏడాది ఆగస్టు  24న  హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.  మాజీ మంత్రి డీకే అరుణను  గద్వాల ఎమ్మెల్యేగా  హైకోర్టు ప్రకటించింది.  ఈ తీర్పును  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  ఇవాళ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల  1వ తేదీన  తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో  తెలంగాణ హైకోర్టు తీర్పు కాపీని  మాజీ మంత్రి  డీకే అరుణ అందించారు. అంతేకాదు ఎమ్మెల్యేగా తనతో ప్రమాణం చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

తనపై ఉద్దేశ్యపూర్వకంగా  తప్పుడు కేసులు పెట్టారని  గద్వాల  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగానే  సుప్రీంకోర్టులో  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో గద్వాల నుండి  మరోసారి పోటీ చేసేందుకు  బీఆర్ఎస్ నాయకత్వం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టిక్కెట్టు కేటాయించింది.  2014, 2018 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. 2014లో ఆయన  ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో  మాజీ మంత్రి డీకే అరుణపై  విజయం సాధించారు.  2014 ఎన్నికలకు ముందు వరకు ఆయన టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణల మధ్య బంధుత్వం ఉంది. అయినా కూడ  వీరిద్దరూ  వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.
also read:ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలి: తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు తీర్పు కాపీ అందించిన డీకే అరుణ

ఈ ఏడాది జూలై  25న  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై  కూడ  తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది.  ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని  వనమా వెంకటేశ్వరరావుపై  తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది. అయితే  తెలంగాణ హైకోర్టు తీర్పును  వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు  తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios