కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీతో చేతులు కలిపిన బీఆర్ఎస్ : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి
Hyderabad: కాంగ్రెస్ ను బలహీనపర్చడానికే బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపిందనీ, అందుకే కేసీఆర్ మిగతా విపక్షాలతో సమావేశమవుతున్నారని ఆయన విమర్శించారు.

Telangana Cong chief Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఏ.రేవంత్ రెడ్డి మరోసారి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ ను బలహీనపర్చడానికే వారి కలిశారనీ, అందుకే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మిగతా విపక్షాలతో సమావేశమవుతున్నారని రేవంత్ ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని బీఆర్ఎస్.. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరైన కేసీఆర్ ఖమ్మం మెగా సభ బలప్రదర్శనను ప్రస్తావిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఎందుకు కేసీఆర్ మిగతా ప్రతిపక్ష పార్టీలను కలుస్తున్నారని ప్రశ్నించారు. "బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపింది. అందుకే కేసీఆర్ మిగతా విపక్షాలతో సమావేశమవుతున్నారు. వారు కాంగ్రెస్ ను బలహీనపర్చాలని చూస్తున్నారు. ప్రధాని మోడీ మార్గాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నారు" అని కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే, "కాంగ్రెస్‌ను బలహీనపరచడానికి బీజేపీ.. బీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)లను ఉపయోగిస్తోంది" అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన ఖమ్మం మెగా సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, వామపక్ష నేతలు రాజా సహా పలువురు నేతలు హాజరయ్యారు.
దేశ పునర్నిమాణం చేసింది కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ దేశం గర్వించదగ్గ సంస్థల్ని ప్రారంభించిందనీ, దేశ పునర్నిమాణం చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. ట్విట్టర్ లో "భారత దేశం గర్వించదగ్గ సంస్థల్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టి. దేశ పునర్నిమాణం చేసింది కాంగ్రెస్! ఆ సంస్థలనన్నిటినీ మోడీ, బీజేపీ అమ్మేస్తుంటే, ప్రజాస్వామిక వ్యవస్థలను కూలదోస్తుంటే,ఈ దుర్మార్గుడు కేసీఆర్ ప్రతీ దుర్మార్గంలో సహకరించిండు! బీఆర్ఎస్ బీజేపికి ఓట్లు చీల్చే బీ-టీం!.. " అంటూ విమర్శించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇంకెప్పుడు తెరుస్తవ్? కేసీఆర్..
"100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు.. ఎనిమిదేండ్లైంది మరి ఇంకెప్పుడు తెరుస్తారు..? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అబద్ధాలు, నయవంచన, మోసం, కుట్రలకు నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.