బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు .. నిందితుడిని తప్పించే యత్నాలు జరుగుతున్నాయా..?
గత శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిందితులను తప్పించే యత్నాలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది . అసలు నిందితుడిని తప్పించడం కోసం షకీల్ పావులు కదుపుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిందితులను తప్పించే యత్నాలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వివరణ ఇచ్చారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ అని తెలిపారు. అతను ప్రస్తుతం పరారీలో వున్నాడని.. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా విజయ్ చెప్పారు. గతంలో కూడా ఓ హిట్ అండ్ రన్ కేసులో రాహిల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ తెలిపారు.
ఘటన జరిగిన రోజున ప్రజా భవన్ ఎదురుగా రోడ్డుపై న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఉన్నాయని.. అత్యంత వేగంగా వచ్చిన కారు వాటిని ఢీకొట్టిందని విజయ్ వెల్లడించారు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు వున్నారని.. వీరంతా కాలేజీ స్టూడెంట్స్ అని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అసలు నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యేను మరొకరి పేరును చేర్చినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. అయితే షకీల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే కారులోంచి ఒకరు పరారవ్వగా.. మరో యువకుడిని పట్టుకున్నారు. అతడికి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేసి మద్యం తాగలేని తేల్చారు. అయితే షకీల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ఆ కారును తానే డ్రైవ్ చేసినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అసలు నిందితుడిని తప్పించడం కోసం షకీల్ పావులు కదుపుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.