ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు.. ఎల్లుండి నుంచి కేసీఆర్ మలివిడత ప్రచారం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే పలు సభల్లో పాల్గొని ఓ రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. దసరా విరామం తర్వాత తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్దమవుతున్నారు. గురువారం (అక్టోబర్ 26) నుంచి కేసీఆర్ మరోసారి సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. తొలి విడత మాదిరిగానే.. ఒక రోజులో 2 లేదంటే 3 సభలకు కేసీఆర్ హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. ఈ విడతలో 30కి పైగా సభల్లో కేసీఆర్ పాల్గొనున్నారు.
ఈ నెల 26న సీఎం కేసీఆర్ ముందుగా అచ్చంపేట, నాగర్‌కర్నూల్ బహిరంగసభల్లో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడుకు చేరుకోనున్నారు. అనంతరం శుక్రవారం (అక్టోబర్ 27) రోజున పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్టోబర్ 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో ఎన్నికల సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందులలో ప్రచారంలో పాల్గొంటారు. నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురిలో బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నవంబర్ 3వ తేదీన ముథోల్, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మంలలో, నవంబర్ 6న గద్వాల్, మక్తల్, నారాయణపేట్, నవంబర్ 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, నవంబర్ 8న సిర్పూర్, అసిఫాబాద్, బెల్లంపల్లిలలో కేసీఆర్.. బీఆర్ఎస్ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అక్టోబర్ 15న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తనకు సెంటిమెంట్‌గా భావిస్తున్న హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదిలాఉంటే, 2014లో బీఆర్‌ఎస్ 63 సీట్లు గెలుచుకుని తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2018లో ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి అధికారం సాధించడం ద్వారా.. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.