పెళ్లికి అందంగా మండపం ముస్తాబైంది. బంధు మిత్రులంతా వచ్చి పెళ్లి తంతు ని వీక్షిస్తున్నారు. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు మండపంపై కూర్చున్నారు. పూజారి... మంత్రాలు చదువుతున్నారు. వధూవరుల చేతిలో జీలకర్ర బెల్లం కూడా పెట్టారు. మరో కొద్ది నిమిషాల్లో పెళ్లి ముగిసేది. సరిగ్గా అప్పుడే ఓ యువకుడు మండపంలోకి అడుగుపెట్టాడు. అంతే.. వధువు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ సంఘటన  వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన ఓ యువతికి ఆమె కుటుంబసభ్యులు పెళ్లి కుదిర్చారు. గతంలో అమ్మాయి కుటుంబం మహారాష్ట్రలోని షోలాపూర్ లో కొంతకాలం ఉండి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఓ అబ్బాయిని ప్రేమించింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. తర్వాత సదరు అమ్మాయి కుటుంబం వనపర్తి వచ్చేశారు.

Also Read పాత మిత్రుడు.. పెళ్లి తర్వాత ఫేస్ బుక్ లో పలకరింపు.. చివరకు...

ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. బలవంతంగా ఆమెకు పెళ్లి చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె ప్రియుడు మండపానికి వచ్చాడు. అంతే... గట్టిగా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ మండపం దిగి పరుగులు తీసింది. అయితే.. మండపానికి వచ్చిన ఆమె ప్రియుడి కారణంగానే పెళ్లి ఆగిపోయిందని.. వధువు బంధువులు కన్నెర్ర చేశారు.

వెంటనే సదరు యువకుడిపై దాడికి దిగారు. దీంతో.. వారు దాడి చేస్తుంటే ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  పెళ్లి ఆగిపోవడంతో.. బంధువులు, పెళ్లి కి వచ్చిన అతిథులు తిరిగి వాళ్ల ఇళ్లకు వెళ్లారు.