మరో మూడు రోజుల్లో పెళ్లి... ఇప్పటికే కుటుంబసభ్యులంతా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. బంధుమిత్రలందరినీ ఆహ్వానించారు. ఇక వధూవరులను ఒక్కటి చేసేందుకు గంటలు లెక్కపెడుతున్నారు. అలాంటి సమయంలో  కాబోయే వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లాలాపేట వినోభానగర్ కి చెందిన రాళ్ల బండి జ్ఞానేశ్వరి కుమార్తె మమత(22)కి భరత్ నగర్ కి చెందిన సందీప్ తో ఈ నెల 13వ తేదీన వివాహం జరపడానికి ఇరువైపులా పెద్దలు నిశ్చయించారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని మమత కుటుంసభ్యులకు చెప్పింది. 

Also Read ఉపాధ్యాయుడు దారుణ హత్య...

శనివారం సాయంత్రం 6 గంటలకు జ్ఞానేశ్వరి పెళ్లి దుస్తుల కోసం షాపింగ్‌కు వెళ్లివచ్చింది. అప్పటిదాకా కూడా బాగానే ఉంది. అంతలో ఏమైందో తెలీదు... గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. డోర్‌ కొట్టగా తీయలేదు. ఇంటిపక్కనున్న జనార్దన్‌ సహాయంతో తలుపులు తెరిచి చూడగా మమత స్కిప్పింగ్‌ తాడుతో సీలింగ్‌ హుక్కుకు ఉరేసుకొని కనిపించింది. వివాహం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.