వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు వుండలేక పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో వుంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చెలరేగిన గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లాకు చెందిన వినోద్, తేజస్విని లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఎప్పటికైనా పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని భావిస్తున్న వీరు పెళ్లికిముందే సహజీవనం చేస్తున్నారు. చంచుపల్లి మండల కేంద్రంలో ఓ గదిని అద్దెకు తీసుకుని భార్యాభర్తల మాదిరిగానే కలిసుంటున్నారు. 

ఇలా సహజీవనంలో వున్న వీరిద్దరి మధ్య తరచూ చిన్న చిన్న విషయాలపై గొడవలు జరుగుతుండేవి. అయితే ఇవి ఈ మధ్య  కాలంలో మరీ తీవ్రమయ్యాయి. దీంతో వీరి మధ్య ప్రేమ తగ్గి ద్వేషాలు పెరిగాయి. 

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ప్రేమికులిద్దరు గొడవపడ్డారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన వినోద్ విచక్షణను కోల్పోయి ప్రియురాలిపై కిరోసిన పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేస్తూ తగలబడుతుండటంతో భయంతో అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు  పోలీసులకు సమాచారం  అందించారు. దీంతో సంఘటనా  స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్దున్నట్లు పోలీసులు తెలిపారు.