ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లికి చెందిన తేజస్విని మూడురోజుల క్రితం అదృశ్యమైంది. ఈ క్రమంలో ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు తీవ్రంగా గాలించారు..

అయితే మంగళవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో తేజస్విని మృతదేహం లభించింది. ఆమెకు పరిచయమున్న బీటెక్ విద్యార్ధి నితినే తేజస్వినిని హత్య చేసి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

డిప్లొమో చదివే సమయంలోనే నితిన్-తేజస్విని ప్రేమించుకున్నారని.. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పోలీసుల చేత కౌన్సెలింగ్ ఇప్పించినట్లుగా తెలుస్తోంది.

అయితే కౌన్సెలింగ్ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని... ఇరువురికి కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. నితిన్ మూడు రోజుల క్రితం తేజస్వినికి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి.. పెనుబల్లికి రమ్మన్నట్టుగా తెలుస్తోంది.

తేజస్వినిని హత్య చేసిన అనంతరం నితిన్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంతవరకు ధ్రువీకరించలేదు.