హుజూరాబాద్ రూరల్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి ప్రమాదవశాత్తు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ కిందనే పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కందుగులలో అందర్నీ కలచివేసింది.

గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మప్పు రాజు, రామాదేవి దంపతులు. వీరికి వర్షిత, కార్తికేయ(5) ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం గ్రామంలో వరికోతలు నడుస్తున్నాయి. దీంతో దంపతులిద్దరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 

ఈ క్రమంలో ఆదివారం ఉదయం రమాదేవి ముందుగా పొలం దగ్గరికి వెళ్లి వచ్చింది. ఇంటి పనుల్లో పడిపోయింది. ఆ తరువాత రాజు కూడా ట్రాక్టర్ తీసుకుని ఇంటికొచ్చాడు. ట్రాక్టర్ ను ఇంటిముందు షెడ్డులో రివర్స్ లో పెడుతున్నాడు. ఈ సమయంలో తండ్రి రాకను గమనించిన కార్తికేయ ఇంట్లో నుంచి పరిగెత్తుకుని వచ్చాడు. 

ఇది తండ్రి గమనించలేదు. ట్రాక్టర్ రివర్స్ తీస్తుండడంతో కార్తికేయ కనిపించలేదు. దీంతో కార్తికేయ మీదినుంచి ట్రాక్టర్ ట్రాలీ టైరు వెళ్లింది. అంతే కార్తికేయ అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ అనుకోని ఘటనకు తండ్రితో పాటు అక్కడికి వచ్చిన తల్లి షాక్ అయ్యింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు టౌన్‌ సీఐ సదన్‌కుమారు తెలిపారు.