తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్ధార్ధ అనే వ్యక్తే కీలక సూత్రధారిగా తెలుస్తోంది.

అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌కి సిద్ధార్థ్ ఈ వ్యవహారంలో మనుషుల్ని సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తున్నాడు సిద్ధార్థ్. అఖిలప్రియ, భార్గవ్‌లకు సిద్ధార్ధ్ పర్సనల్ గార్డ్‌గా వ్యవహరిస్తున్నాడు.

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ వల్ల సరైన సిబ్బంది లేరని.. సాయం చేసేందుకు వెంటనే రావాలని సిద్ధార్థ్‌కు భార్గవ్ రామ్ చెప్పాడు. భార్గవ్ ఆదేశంతో 15 మందితో సిద్ధార్థ్ హైదరాబాద్‌కు వచ్చాడు.

అనంతరం సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్.. నవీన్ రావు సహా ముగ్గురిని కిడ్నాప్ చేసింది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ గ్యాంగ్‌లోని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం సిద్ధార్థ్ పరారీలో వుండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Also Read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: భూమా అఖిలప్రియ ఫోన్ల స్వాధీనానికి పోలీసుల ప్రయత్నం

మరోవైపు బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు చెందిన  రెండు సెల్ ఫోన్లను  స్వాధీనం చేసుకొనేందుకు గాను పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ కిడ్నాప్ కోసం అఖిలప్రియతో పాటు నిందితులు కొత్త సిమ్ కార్డులు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. అఖిలప్రియ ఉపయోగించిన నెంబర్ ను పోలీసులు గుర్తించారు. 

ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో కిడ్నాప్ జరిగిన సమయంలో విజయవాడ నుండి అఖిలప్రియ ఫోన్ లో మాట్లాడుకొంటూ హైద్రాబాద్ కు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో రెండు ఫోన్లను ఉపయోగించారని పోలీసులు గుర్తించారు.