తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ముగ్గురుని అరెస్ట్‌ చేశారు. వీరినుంచి పలు కీలక ఆధారాలు సేకరించారు. 

ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయను అరెస్ట్ చేశాం. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నాం అన్నారు.

నిందితులు ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వాడారని, బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ప్రధాన సూత్రధారి అని తేల్చి చెప్పారు. కిడ్నాప్‌ చేయడానికి ముందు నిందితులు మియాపూర్‌లో ఆరు సిమ్‌ కార్డులు కొన్నారు. కాగా వీటిలో 70956 37583 నంబర్‌ని అఖిలప్రియ వాడారు. 

మల్లికార్డున్‌రెడ్డి ద్వారా 6 సిమ్‌లు, మొబైల్స్ కొనుగోలు చేశారు. కిడ్నాప్‌నకు ముందు నిందితులు రెక్కి నిర్వహించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది పాత్ర ఉందని సీపీ తెలిపారు. 

ఇక అఖిల ప్రియ ఆరోగ్యం విషయంలో ఆమె చెల్లెలు ఆరోపిస్తున్నట్టుగా ఏమీ సమస్య లేదని, ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో అఖిలప్రియని అరెస్ట్ చేశామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు అన్నివైద్య పరీక్షలు చేయించాం. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిపోర్టుల్లో వచ్చింది. మెడకల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాం అని సీపీ అంజనీకుమార్ అన్నారు.