అమెరికాలోని బోస్టన్ నగరంలో నిర్వహించిన కీలక సదస్సు, రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొని అద్భుత ప్రసంగం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే మసాచుసెట్స్ గవర్నర్ మాట్లాడుతూ, బోస్టన్ నగరానికి, హైదరాబాద్ నగరానికి మధ్య సారూప్యత ఉన్నదని, హైదరాబాద్‌తో బోస్టన్ నగరం కలిసి నడుస్తుందని వివరించారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో కలిసి అడుగు వేయడానికి అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకు వచ్చింది. ఈ మేరకు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు ఓ సమావేశంలో ప్రకటించారు. బోస్టన్‌లో జరిగిన ఇన్నోవేషన్ 2022 హెల్త్ కేర్ ఎట్ ఎ గ్లేన్స్ అనే సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్, బోస్టన్ నగరానికి మధ్యనున్న సారూప్యతలను ఆయన వివరించారు. ఈ విషయంపై మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ కూడా అంగీకరించారు.
బోస్టన్ నగరంలో నిర్వహించిన సదస్సులో మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ మాట్లాడుతూ, బోస్టన్ నగరానికి, హైదరాబాద్‌కు మధ్య సారూపత్యలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తరహాలోనే బోస్టన్‌లోనూ ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయని వివరించారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం పరస్పర అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే పని చేయాలని పేర్కొన్నారు. తద్వార అనేక నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు అవకాశం కల్పించినవారిమి అవుతామని అన్నారు.
బోస్టన్ నగరంలో హెల్త్ రికార్డుల డిజిటలీకరణ సాగుతున్నదని, తద్వార పౌరులు అనేక ప్రయోజనాలను సులువుగా పొందగలుగుతున్నారని మసాచుసెట్స్ గవర్నర్ అన్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ కాలంలో వేగంగా చికిత్స అందించడానికి ఉపకరించిందని తెలిపారు.
కాగా, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ఇరు నగరాల మధ్య అవగాహన కార్యక్రమాలు చేపడితే భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పౌరుల హెల్త్ రికార్డుల డిజిటలీకరణ చేపట్టిందని వివరించారు. ప్రస్తుతం లైఫ్ సైన్సెస్ రంగంలోని సైంటిస్టులు, ఐటీ, టెక్ రంగాల డేటా సైంటిస్టుల ఉమ్మడి కృషితో రానున్న రోజుల్లో అద్భుత ఆవిష్కరణలకు ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర అభివృద్ధి చేపడుతున్నదని, తద్వార పలు రంగాలకు తెలంగాణ ఆకర్షణీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా బయో, లైఫ్ సైన్సెస్ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను నోవార్టిస్ వంటి కంపెనీలను ఉదహరించి వివరించారు. కేటీఆర్ ప్రసంగానికి సదస్సులో విశేష ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో నిర్వహణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్, నిర్వహణ హెల్త్ కేర్ చైర్‌పర్సన్ జాన్ స్కల్లీ, సీఈవో రవి ఐక, శశి వల్లిపల్లిలు
పాల్గొన్నారు.
రౌండ్‌టేబులో సమావేశంలో కేటీఆర్
లైఫ్ సైన్సెస్ ఫార్మా సెక్టార్‌లో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికా కంపెనీల ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. బోస్టన్ నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేస్తూ.. హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరు ఉన్నదని అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగానికి అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందని, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడి మౌలిక వసతులు, పాలసీ నిర్ణయాలు, ఇన్నోవేషన్ కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు, జీనోమ్ వ్యాలీలో ప్రత్యేకంగా ఒక ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయడం వంటి అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఈ నిర్ణయాల సానుకూల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేసే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకున్నదని తెలిపారు.
