ముంబై: జైలులో ఉన్న ప్రముఖ విప్లవ కవి వరవరరావును వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని హైకోర్టు ప్రభుత్వంపై మండిపండిది. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. 

వరవరరావును ప్రత్యేక కేసుగా పరిగణించి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చి. 15 రోజులపాటు చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆస్పత్రిలో వరవరరావును చూసేందుకు ఆస్పత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని కోర్టు సూచించింది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణపై వీవీ తలోజా జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును నానావతి ఆస్పత్రికి తరలించి వెంటనే చికిత్స అందేలా చూడాలని ఆయన భార్య హేమలత దాకలు చేసిన రిట్ పిటిషన్ మీద బుధవారం కోర్టు విచారణ జరిపింది. వరవరరావు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం వ్యవరిస్తోందని ఆమె తన పిటిషన్ లో ఆరోపించారు. 

తీవ్రమైన అనారోగ్య సమస్యతో దాదాపుగా మరణశయ్య మీద ఉన్న ఓ 80ఏళ్ల వ్యక్తికి తలోజా జైలులోనే చికిత్స అందిస్తామని ఎలా చెప్పారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నానావతి ఆస్పత్రిలో వరవరరావు చికిత్స అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోర్టు ఆదేశించింది. చికిత్సకు అయ్యే ఖర్చును వరవరరావే భరించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది దీపక్ ఠాక్రే చేసిన వాదనను వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర జైసింగ్ తోసిపుచ్చారు.

పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించలేకపోవడానికి డబ్బులు లేవనే కారణాన్ని ప్రభుత్వం చూపకూడదనే సుప్రీంకోర్టు తీర్పును ఆమె ఉటంకించారు. ఆమె వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ప్రస్తుతం వరవరరావు ప్రభుత్వం కస్టడీలో ఉన్నాడని, ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కస్టడీలోనే ఉన్నట్లు భావించాలని, అందువల్ల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.