భూపాలపల్లి: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు చేరడంతో నదులన్నీ ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ శుభకార్యానికి వెళ్లి వస్తూ కొందరు ఇంద్రావతి నదిని దాటే ప్రయత్నం చేసి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన  తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన 15మంది తెలంగాణ మీదుగా ప్రయాణించి చత్తీస్ ఘడ్ లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇంద్రావతి నదిని నాటు పడవల సాయంతో దాటారు. అయితే తిరుగు ప్రయాణం సమయంలో అదే నాటుపడవలో నదిని దాటుతుండగా ప్రమాదం సంభవిచింది. నీటి ప్రవాహం పెరగడంతో నాటుపడవ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్నవారు నదిలో కొట్టుకుపోయారు. 

అయితే కొందరికి ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు రాగా మరికొందరు ఓ బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మరికొందరికి కాపాడారు. ఇలా పడవలో ప్రయాణిస్తున్నవారిలో పదిమంది పురుషులు, ముగ్గురు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. కానీ మరో ఇద్దరు మహిళలు మాత్రం నీటిలో గళ్లంతయ్యారు.   

స్థానికులు ఎంత వెతికినా ఇద్దరు మహిళల ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో అటవీ, పోలీసు శాఖ అధికారులు గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం భూపాలపల్లి జిల్లా పలిమెల మండలానికి సమీపంలో చోటుచేసుకుంది.