హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు, కార్యకర్తలను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

జీహెచ్ఎంసీలో చట్టసవరణతో పాటు, హైకోర్టు సూచన మేరకు కొన్ని చట్టాల్లో సవరణల కోసం తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని ఎల్ఆర్ఎస్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.

అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఎల్ఆర్ఎస్ ద్వారా  ప్రజల జేబులకు ప్రభుత్వం చిల్లులు పెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎల్ఆర్ఎస్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొంది.
ఇవాళ అసెంబ్లీలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది. రేపు తెలంగాణ శాసనమండలి సమావేశం కానుంది.