Asianet News TeluguAsianet News Telugu

బిజెపి తెలంగాణ ప్లాన్: కోదండరామ్ కు గాలం, టిజెఎస్ విలీనానికి ప్రతిపాదన

టిజెఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని బిజెపి నేతలు కోదండరామ్ ను కోరుతున్నారు. కోదండరామ్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

BJP woos Kodandaram to merge TJS in BJP
Author
Hyderabad, First Published Aug 8, 2022, 9:51 AM IST

హైదరాబాద్: తెలంగాణలో పట్టు సాధించి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి అన్ని ప్రయత్నాలను సాగిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని బలమైన నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బిజెపిలో చేరడం ఖాయమైంది. ఇదే సమయంలో తెలంగాణ జన సమితి (టిజెఎస్) వ్యవస్థాపకుడు కోదండరామ్ కు బిజెపి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. 

టిజెఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని బిజెపి అగ్రనేతలు కోదండరామ్ ను కోరుతున్నారు. హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పటి నుంచి బిజెపి నేతలు ఆయనను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కోదండరామ్ వామపక్షాల భావజాలం కలిగినవారు. అందువల్ల ఆయన బిజెపి ప్రతిపాదనకు అంగీకరిస్తారా అనేది సందేహం. అయితే, ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉదంతాన్ని కొంత మంది ఉదహరిస్తున్నారు. కెసిఆర్ ను ఓడించడానికి అంతకన్నా మార్గం లేదని గట్టిగా నమ్మితే కోదండరామ్ అందుకు అంగీకరించవచ్చనని అంటున్నారు. అందుకే, కోదండరామ్ కోసం బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినవారి పట్ల బిజెపి అమితమైన గౌరవాదరాలతో వ్యవహరిస్తుందని, రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినవారికి తాము అధికారంలోకి వస్తే తగిన గౌరవం ఇస్తామని బిజెపి నేతల్లో ఒకరిద్దరు కోదండరామ్ ను ఒప్పించడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. 

కోదండరామ్ టిజెఎస్ ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో తగిన ఉనికిని చాటుకోలేకపోయింది. దీంతో పార్టీ నాయకులు తమ దారులు తాము వెతుక్కుంటున్నారు. టిజెఎస్ కు చెందిన న్యాయవాది అర్చనా రెడ్డి ఇటీవలే బిజెపిలో చేరారు. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఆమె బిజెపిలో చేరారు.

తెలంగాణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకమైన ద్రుష్టి కేంద్రీకరించారు. దీంతో ఆయన కోదండరామ్ తో మాట్లాడేందుకు తన జట్టును హైదరాబాద్ కు పంపినట్లు తెలుస్తోంది. టిజెఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని ఇంతకు ముందు టిఆర్ఎస్ నేతలు కూడా కోదండరామ్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకుడొరకు ప్రాంతీయ పార్టీగా టిజెఎస్ ను బలోపేతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

టిజెఎస్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కానీ ఆ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఇటీవల కోదండరామ్ ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థితిలో కోదండరామ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios