కరీంనగర్‌ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత బొడిగె శోభ. ఆర్టీసీని ప్రైవేట్ పరంచేసేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెకు మద్దతు ప్రకటించిన ఆమె కేసీఆర్ సర్కార్ ని తిట్టిపోశారు.

ఆర్టీసీని ఉత్తర, దక్షిణ తెలంగాణగా విడగొట్టి ఉత్తర తెలంగాణను పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావుకు, దక్షిణ తెలంగాణను మేఘా ఇంజనీరింగ్‌ అధినేత కృష్ణారెడ్డికి అప్పగించే కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు. 

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసినా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినా సహించేది లేదని హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే శోభ హెచ్చరించారు.

అందులో భాగంగా 11వ రోజు మంత్రుల ఇళ్ల ముందు పిండం పెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొమ్మిది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ గానీ మంత్రులుగానీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. 

సమస్యను పరిష్కరించని మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా మనోళ్లు కాదని తేల్చి చెప్పారు. సమస్యను  సామరస్యంగా పరిష‍్కరించాలని, బెదిరింపులతో కార్మికులను రెచ్చగొట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు మాజీ ఎమ్మెల్యే శోభ.