హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు. 

సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తోందిన ఆయన ధీమాను వ్యక్తం చేశారు.  ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. 

తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఇటీవల జనగామలో బీజేపీ కార్యకర్తలపై చేసిన లాఠీఛార్జీని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కార్యకర్తలు భయపడొద్దని ఆయన కోరారు. పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అక్రమ కేసులతో బీజేపీని అడ్డుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ విమర్శించారు. 

రానున్న రోజుల్లో కూడ ఇదే తరహాలో  కలిసి కట్టుగా పనిచేయాలని సంజయ్ పార్టీ కార్యకర్తలను కోరారు. లాక్‌డౌన్ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా బీజేపీ కార్యకర్తలు ప్రజలకు సేవలు చేశారని ఆయన కొనియాడారు.

కరోనా విషయంలో కేసీఆర్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని టీఆర్ఎస్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.