తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఆలస్యంగానైనా టీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఎన్నికలకు ముందు అనుసరించాల్సిన వ్యుహాలపై ఓ క్లారిటీకి వచ్చింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఆలస్యంగానైనా టీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఎన్నికలకు ముందు అనుసరించాల్సిన వ్యుహాలపై ఓ క్లారిటీకి వచ్చింది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని బీజేపీ గూటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.
ఎవరూ అంటరానివారు కాదని బీజేపీ విశ్వసిస్తుందనే స్పష్టమైన సంకేతాలను కూడా ఆయన పంపారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లోని టీఆర్ఎస్ నేతుల బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. వివిధ స్థాయిల్లో కమిటీలు వేసి అలాంటి టీఆర్ ఎస్ నేతలను గుర్తించి బీజేపీలోకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీలోకి చేరాలనుకునేవారు.. తమ వ్యక్తిగత అజెండాలను పక్కనబెట్టి, దేశ శ్రేయస్సు, అభివృద్ధికి విధేయత చూపుతామని ప్రమాణం చేయవలసి ఉంటుందన్నారు.
“బీజేపీ కార్యకర్తలకు, ఇతర పార్టీల వారికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే.. మన కార్యకర్తలు వారి సొంత ప్రయోజనం కోసం కాకుండా.. దేశ అభివృద్దికి కృషి చేస్తారు’’ అని తరుణ్ చుగ్ చెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన తరుణ్ చుగ్.. దేశం ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. ఫ్యామిలీ లాస్ట్.. అనేదే బీజేపీ నినాదం అని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముక్త్ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
ఇక, బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారిని పరిశీలించేందుకు సీనియర్ నేత ఎన్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో బీజేపీ ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. అయితే నిన్నటి సమావేశంలో చేరికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన తరుణ్ చుగ్.. బీజేపీ రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో చాలా బలంగా లేదని విషయాన్ని సూచించినట్టుగా అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నాయకులను ఆకర్షించడం ద్వారా.. ఆ పార్టీని ఢీ కొట్టడానికి బీజేపీ సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా ఓటర్లను ప్రభావితం చేయగల అధికార పార్టీ నాయకులతో తన ఉనికిని పెంచుకోవడానికి గత అవకాశాలను బీజేపీ పరిశీలిస్తోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌తో నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించడం ఖాయమని తరుణ్ చుగ్ కూడా చెప్పారు. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చుగ్ అన్నారు. ఇది తాను మాత్రమే చెప్పడం కాదని.. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే మాట చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందని.. టీఆర్‌ఎస్ కథ ఎప్పటికైనా ముగుస్తుందని ఆయన అన్నారు. మే 30 నుంచి 15 రోజుల పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, విప్లవాత్మక ప్రజానుకూల నిర్ణయాల గురించి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ, రాహుల్ గాంధీ పాల్గొన్న కాంగ్రెస్ సమావేశం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న బీజేపీ సభలను పరిశీలిస్తే రాష్ట్రంలో బీజేపీదే విజయం అని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రజలు ఇదే చెబుతున్నారని.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు సర్వేలు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పరిస్థితి బాగా దిగజారిందని సర్వేలు వెల్లడిస్తున్నాయని అన్నారు.
