మునుగోడు ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 29న లేదంటే 31వ తేదీన భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి. అలాగే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కింది స్థాయి నేతల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వల విసురుతున్నాయి. ఈ మైండ్ గేమ్‌లో టీఆర్ఎస్ ముందంజలో వుంది. బూర నర్సయ్య గౌడ్‌ను లాగేసినప్పటికీ .. తాజా వ్యవహారాలతో బీజేపీ శ్రేణులు డీలా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో జోష్ నింపేందుకు గాను బీజేపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అక్టోబర్ 29న లేదంటే 31వ తేదీన భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా... మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బూర నర్సయ్య గౌడ్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివరాలు.. బూర నర్సయ్య గౌడ్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జై కేసారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. అయితే బూర నర్సయ్య గౌడ్ ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. బూర నర్సయ్య గౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also REad:సుద్దపూసలు కాదు.. మేకవన్నె పులులు.. చేనేత కంట్లో కారం కొట్టారు: చుండూరులో ఈటెల ఘాటు వ్యాఖ్యలు
అయితే ఈ పరిణామాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు యత్నించగా తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక, అభివృద్ధిపై చర్చకు రావాలని జై కేసారంకు ఇన్ఛార్జీగా ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి బూర నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు.
