Asianet News TeluguAsianet News Telugu

దసరా తర్వాత బిజెపి దూకుడు: భారీ చేరికలకు ప్లాన్

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపైన ప్రత్యేక దృష్టి సారించింది. కిషన్ రెడ్డి కి మంత్రి పదవిని కేటాయించడం నుంచి మొదలుకొని అమిత్ షా నెలవారీ పర్యటనల వరకు ప్రతి విషయం మనకు బీజేపీ తెలంగాణాలో జెండా పాతడానికి ఎంతలా కృషి చేస్తుందో నిరూపిస్తున్నాయి.

BJP to intensify its politics after dasara
Author
Hyderabad, First Published Sep 22, 2019, 6:41 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు పార్లమెంటు ఎన్నికల తరువాత ఓక కొత్త రూపును సంతరించుకున్నాయి. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంత పెద్ద రాజకీయ శక్తి కాదు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 4 సీట్లను గెలిచి రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు వరకు కేవలం కాంగ్రెస్, తెరాస ఈ రెండు పార్టీల చుట్టూ మాత్రమే తిరిగిన రాజకీయం ఇప్పుడు బీజేపీ ఎంట్రీ తో మూడు ముక్కలాటగా మారింది. 

దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న నాయకాత్య లేమి దృష్ట్యా కాంగ్రెస్ బలహీనపడ్డట్టుగా మనకు అర్థమౌతుంది. దీనితోనీపాటు పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీని గట్టిగానే దెబ్బతీశాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపైన ప్రత్యేక దృష్టి సారించింది. కిషన్ రెడ్డి కి మంత్రి పదవిని కేటాయించడం నుంచి మొదలుకొని అమిత్ షా నెలవారీ పర్యటనల వరకు ప్రతి విషయం మనకు బీజేపీ తెలంగాణాలో జెండా పాతడానికి ఎంతలా కృషి చేస్తుందో నిరూపిస్తున్నాయి. తామే తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా ప్రయత్నిస్తున్నారు. 

కర్ణాటక తరువాత దక్షిణ భారత దేశంలో తమకు ఆస్కారమున్న రెండో రాష్ట్రంగా బీజేపీ తెలంగాణను పరిగణిస్తుంది. దీనితో ఇప్పుడు కెసిఆర్ ను నేరుగా టార్గెట్ చేసే పనిలో నిమగ్నమయ్యింది. 

ఇందులో భాగంగానే తెరాస, ఎంఐఎం ల మైత్రిని ఎండగడుతూ సెప్టెంబర్ 17ను గ్రాండ్ గా జరిపి తెరాస ను ఇరకాటంలోకి నెట్టాలని బీజేపీ భావించింది. ఆరోజు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను హైదరాబాద్ కు రప్పించి భారీ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టింది. కాకపోతే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అమిత్ షా ఆరోజు రాలేకపోయిన  కారణంగా ఆ ప్లాన్ కాస్తా వర్క్ అవుట్ అవ్వలేదు. 

సెప్టెంబర్ 17 రోజు భారీ స్థాయిలో  నాయకుల చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెప్పారు. ఇలా కాషాయ కండువా కప్పుకునేవారిలో అధికార తెరాస పార్టీ నేతలు కూడా ఉండబోతున్నట్టు వారు తెలిపారు. కాకపోతే, అమిత్ షా పర్యటన రద్దవడంతో ప్రస్తుతానికి  ప్రోగ్రాం కి బ్రేకులు పడ్డట్టయ్యింది. 

అమిత్ షా ప్లాన్ లో భాగంగా ప్రతి నెలా, కనీసం ఒక కేంద్ర మంత్రి తెలంగాణాలో పర్యటిస్తున్నారు.  రెండు రోజుల కింద కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వచ్చి వెళ్లారు. నిన్న మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చారు. కార్యకర్తలతో మాట్లాడి వారిలో కొత్త జోష్ నింపారు. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, బెంగాల్, ఒడిశా, తెలంగాణలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందని వారి స్ట్రాటజీని పరోక్షంగా చెప్పారు. 

సెప్టెంబర్ 17ను హైజాక్ చేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను కెసిఆర్ చాల తెలివిగా ఎదుర్కొన్నాడనే చెప్పాలి. యురేనియం మైనింగ్ విషయం అదే సమయానికి ముందుకు రావడం, బడ్జెట్ సమావేశాలను ఆ సమయంలో నిర్వహించడం వల్ల ప్రజల దృష్టిని అటువైపుగా మరల్చే ప్రయత్నం చేసాడు. 

ఈ పరిస్థితుల్లో ఇలానే ఊరుకుంటే మంచిది కాదు అని భావించిన బీజేపీ, ఇంతకు ముందు ప్లాన్ చేసినట్టు ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీ లోకి చేర్చుకునేందుకు కొత్త ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దసరా తరువాత ఈ చేరికలు ఉండబోతున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ విషమై అమిత్ షా తో చర్చించగా దసరా తరువాత అమిత్ షా హైదరాబాద్ రావడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. అదే రోజు శంషాబాద్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభలోనే ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరతారట. ఇప్పటికే సదరు నేతలతో చర్చలు కూడా పూర్తిచేసినట్టు సమాచారం. 

మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, జంటనగరాలకు చెందిన ముఖ్య నేతలను ఆ రోజు పార్టీలో చేర్చుకోనున్నట్టు సమాచారం. టీడీపీ లో నెంబర్ 2 గా వెలిగిన దేవేందర్ గౌడ్, అతని తనయుడు కూడా అదే రోజు చేరటానికి ఒప్పుకున్నారట. 

ఇక్కడే కథలో మరో ట్విస్ట్ ఏమిటంటే, మైనారిటీ సామాజికవర్గ నేతలు కూడా భారీ సంఖ్యలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. తాజాగా గవర్నర్ తమిళిసై ని ట్విట్టర్ ద్వారా ప్రజా దర్బార్ నిర్వహించవలిసిందిగా కోరింది కూడా ఒక మైనారిటీ నాయకుడే. ఇదంతా చూస్తుంటే మైనారిటీ నేతలు కూడా భారీగానే చేరేట్టుగా పరిస్థితి కనబడుతోంది. 

కెసిఆర్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు కూడా ఇదే వేదికను బీజేపీ ఉపయోగించుకోనుంది. తెరాస అసమ్మతులకు కూడా గాలం వేసే పనిలో నిమగ్నమయ్యింది. ఇటీవలి కాలంలో తెరాస పార్టీలోంచి అసమ్మతి గానాలు వినపడుతున్నాయి. ఈటెల రాజేందర్ వ్యవహారంతో మొదలైన ఈ అసమ్మతి సెగ ఇప్పుడప్పుడు చల్లబడేదిలా కనపడడం లేదు. కనీసం రెండు రోజులకోసారైనా ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో తమ నిరసనను తెలుపుతూనే ఉన్నారు. 

మంత్రివర్గ విస్తరణ తరువాత తెరాస నాయకుల్లో ఒకింత అసంతృప్తి బయల్దేరిన మాటైతే వాస్తవం. నాయిని నరసింహ రెడ్డి నుంచి మొదలుకొని రాజయ్య వరకు తలా ఒక అసంతృప్తి కామెంట్ ను పాస్ చేసినవారే. 

ఈ నేపథ్యంలో, బీజేపీ తెరాస నాయకులకు గాలం వేస్తుండడం, వారు కూడా అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతూ ఉండడంతో తెరాస కలవరపడుతోంది. అసంతృప్త నేతలను బుజ్జగించే పనుల్లో బిజీగా ఉంది తెరాస పార్టీ. 

బీజేపీ ఏమో తెరాస నుంచి కూడా చేరికలు ఉంటాయని ప్రకటిస్తోంది. వారి పేర్లను మాత్రం ఆ సభ జరిగే ముందు వరకు కూడా బయటకు పొక్కనియ్యకుండా ఉంచి అదే రోజు కెసిఆర్ కు గట్టి షాక్ ఇవ్వాలనే యోచనలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios