తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం ఓ తెలుగు నేతను రాజ్యసభకు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.  తెలంగాణ నుంచి గరికపాటి మోహన రావును రాజ్యసభలోకి తీసుకోవాలని అనుకున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. 

హైదరాబాద్: బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ పెంచుతున్నది. ముఖ్యంగా తెలంగాణపై దృష్టి పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సహా లోక్ సభ ఎన్నికల్లోనూ దక్షిణాది నుంచి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ నుంచి ఓ తెలుగు నేతను రాజ్యసభకు తీసుకోవాలనే ఆలోచనలు చేసింది. గత కొన్ని రోజులుగా బీజేపీ భేటీల మీద భేటీ నిర్వహిస్తున్నది. పక్కా స్ట్రాటజీలు రూపొందిస్తున్నది.

తెలంగాణ నుంచి గరికపాటి మోహన్ రావును రాజ్యసభకు తీసుకోవాలనే ఓ నిర్ణయానికి వచ్చినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. గరికపాటి మోహన్ రావును రాజ్యసభకు తీసుకోవడం ద్వారా బీజేపీలోకి చేరాలనే వారికి ఓ సంకేతాన్ని ఇచ్చినట్టవుతుందనీ భావిస్తున్నట్టు వివరించాయి.

టీడీపీలో కీలక నేతగా ఉన్న గరికపాటి.. బీజేపీలో చేరి చాన్నాళ్లు అవుతున్నా.. పార్టీ ఆయనకు చెప్పుకోదగిన పదవి ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఈయనను రాజ్యసభకు తీసుకోవాలని, తద్వార వేరే పార్టీల నుంచి బీజేపీలోకి చేరాలనే ఆలోచనల్లో ఉన్నవారికీ ఓ సంకేతం వెళ్లుతుందని, బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లితే వారికి కూడా పదవి దక్కుతుందనే ఆశ పుడుతుందనే వ్యూహంతో గరికపాటిని రాజ్యసభకు తీసుకోవాలని ఎత్తుగడ వేసినట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

Also Read: కేసీఆర్ పింఛన్‌లు మంచిగిత్తండు.. పాలన అప్పటికంటే ఇప్పుడు నయ్యం : ఎమ్మెల్సీ కవితతో కంకులమ్మే కొమురవ్వ (Video)

కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ పుంజుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నేతలు వెళ్లుతున్నారు. బీజేపీ నుంచి కూడా వెళ్లాలనే ఆలోచనల్లో కొందరు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ, బీజేపీకి వచ్చే వారు ఇప్పుడైతే లేరని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.