హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటన ముగించుకున్న తక్షణమే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ బాట పట్టారు. కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు. ఆ తర్వాత వెంటనే రాత్రి బండి సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇది రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు భావిస్తున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొనడానికి బిజెపి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతూ ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనక రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. పార్టీ ఢిల్లీ నాయకత్వం పిలుపు కారణంగానే బండి సంజయ్ వెళ్లారని అంటున్నారు. సోమవారం జరిగే పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి బండి సంజయ్ హాజరవుతారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. 

ఇదే సమయంలో బండి సంజయ్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తన ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ బిజెపి పెద్దల వద్ద ఓ ప్రతిపాదన పెట్టినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దానిపైనే బండి సంజయ్ తో బిజెపి ఢిల్లీ నాయకత్వం చర్చిస్తుందని కూడా అంటున్నారు. కేసీఆర్ పెట్టిన ప్రతిపాదన ఏమిటనేది తెలియడం లేదు.

తెలంగాణలో కేసీఆర్ పట్ల ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని, ఈ స్థితిలో టీఆర్ఎస్ ను ఢీకొట్టడం సులభమవుతుందని, అందుకు అనుగుణమైన వ్యూహాలను సిద్ధం చేసుకుని కత్తులు దూయాలని బిజెపి భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తోంది. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు స్వయంగా బంద్ లో పాల్గొన్నారు. ఈ స్థితిలో కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో రైతులకు సంఘీభావం ప్రకటిస్తారని భావించారు. కానీ ఆయన ఆ జోలికి కూడా వెళ్లలేదు. బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన కేసీఆర్ ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కలుసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. 

తెలంగాణ బిజెపి నేతలు అదే అదునుగా కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. నిరుడు డిసెంబర్ లో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కు ప్రదాని అపాయింట్ మెంట్ దొరకలేదు. కానీ ఈసారి పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ తో పాటు ప్రధాని అపాయింట్ మెంట్ కూడా దొరికింది. చకచకా కేసీఆర్ తన భేటీలను ముగించుకున్నారు. అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ తమపై తీవ్రమైన విమర్శలు చేసే ఉద్దేశం ఉందని, కేసీఆర్ కు ఆ అవకాశం ఇవ్వకూడదని కూడా అనుకున్నట్లు చెబుతున్నారు. 

తెలంగాణలో బిజెపి మాత్రం కేసీఆర్ ను ఢీకొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనైప అనుమానాలు రేకెత్తించే విధంగా తెలంగాణ బిజెపి నేతలు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ కు లాభం కన్నా రాజకీయంగా నష్టమే చేసిందని చెప్పాలి.