గోదావరిఖని:సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రులకు లేఖ రాస్తానని ఆయన ప్రకటించారు.

మంగళవారం నాడు సింగరేణిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.బుధవారం నాడు ఈ ఘటనపై ఆయన స్పందించారు. సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గని లో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలన్నారు.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.సింగరేణిలో అధికారులకు అక్షయ పాత్రగా  ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు మారిపోయారని ఆయన ఆరోపించారు.

also read:మృతుల కుటుంబాలకు పరిహారం కోసం ఆందోళన: గోదావరిఖని ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

కాంట్రాక్టు కేటాయించి పనులపై పర్యవేక్షణ చేయని సింగరేణి అధికారులదే వైఫల్యమన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి నిబంధలను గాలికి వదిలి వేయటంతో నే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.  

సింగరేణి ఓబీ పనుల్లో బినామిలతో అధికార పార్టీ నేతలు కాంట్రాక్టు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.  మృతి చెందిన కుటుంబాలకు కంపెనీ లో ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.