హైదరాబాద్: తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ విమర్శించారు. త్వరలోనే రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి కల్గిస్తామని ఆయన చెప్పారు.

మంగళవారం నాడు ఆయన కరీంనగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనపై సీబీఐ విచారణ కోరుతామన్నారు. దోపీడీ దొంగలను బీజేపీ ఎప్పుడూ వదలదని ఆయన పరోక్షంగా టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లతో నేరస్తులను పోలీసులు కాపాడుతున్నారని ఆయన విమర్శించారు.

బీజేపీపై తెలంగాణ ప్రజలకు రోజు రోజుకి నమ్మకం పెరుగుతోందన్నారు. కవిత యూనియన్ లీడర్ గా అంతా తన చేతుల్లో పెట్టుకొంటుందని ఆయన విమర్శలు గుప్పించారు. సింగరేణిలో కవిత పెత్తనం చెలాయిస్తోందని ఆయన ఆరోపించారు.వివిధ పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. త్వరలోనే చాలా మంది బీజేపీలో చేరుతారని ఆయన చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుహ్య ఫలితాలను సాధించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది.