Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన ఓట్ల వాటాతో బిజెపి జోష్: కేసీఆర్ కాళ్ల కిందికి నీళ్లు

టీఆర్ఎస్ కు కాంగ్రెసు ప్రత్యామ్నాయంగా మారలేని స్థితిలో బిజెపి రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది.  వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి 30-35 శాతం ఓట్ల శాతాన్ని సాధించుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుందని అంటున్నారు. 

BJP takes Telangana by storm, gets 19.45% vote share
Author
Hyderabad, First Published May 25, 2019, 12:36 PM IST

హైదరాబాద్: తెలంగాణలో నాలుగు లోకసభ స్థానాలను గెలుచుకున్న బిజెపి జోష్ లో ఉంది. శాసనసభ ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ తిన్న బిజెపి లోకసభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలను సాధించింది. లోకసభ ఎన్నికల్లో బిజెపికి 19.45 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాళ్లకిందికి నీళ్లు తేవడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

టీఆర్ఎస్ కు కాంగ్రెసు ప్రత్యామ్నాయంగా మారలేని స్థితిలో బిజెపి రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది.  వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి 30-35 శాతం ఓట్ల శాతాన్ని సాధించుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుందని అంటున్నారు. 

గత 20 ఏళ్ల కాలంలో ఎన్నడూ సాధించలేని సీట్లను బిజెపి ఈ ఎన్నికల్లో సాధించింది. పైగా, ఒంటరిగా పోటీ చేసి తన సత్తా చాటింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి 1999లో ఏడు సీట్లను గెలుచుకుంది. 2004లోనూ, 2009లోనూ బిజెపి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో మాత్రం సికింద్రాబాదు సీటు నుంచి బండారు దత్తాత్రేయ గెలిచారు. 

ఈ ఎన్నికల్లో సికింద్రాబాదు సీటును నిలబెట్టుకోవడమే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ సీట్లను గెలుచుకుంది. మహబాబ్ నగర్ స్థానంలో రెండో స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ అభ్యర్థిపై డీకె అరుణ ఓటమి పాలయ్యారు. ఆణెకు 33.88 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి కేవలం 19 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాస్తా ముందుగా బిజెపిలో చేరి ఉంటే అరుణ గెలిచి ఉండేవారని అంటున్నారు. 

తెలంగాణ ఫలితాలపై బిజెపి జాతీయ నాయకత్వం జూన్ మొదటి వారంలో సమీక్ష జరపనుంది. నాలుగు సీట్లను గెలుచుకున్నప్పటికీ 10 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. ఖమ్మం లోకసభ అభ్యర్థి దేవకి వాసుదేవరావుకి కేవలం 1.8 శాతం, మహబూబాబాద్ అభ్యర్థి జె. హుస్సేన్ కు 2.5 శాతం, 30 ఏళ్ల క్రితం వరంగల్ సీటును బిజెపి గెలుచుకుంది. ఈ స్థానంలో ఈసారి కేవలం 7.89 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది బిజెపి నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios