హైదరాబాద్: రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ విజయదుందుభి మోనుందని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో పర్యటించిన ధర్మేంద్రప్రధాన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా తెలంగాణలోని పలువురుని కలిశారు.  

ఆర్టికల్‌ 370 రద్దు, ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలపై ప్రతీ ఒక్కరికీ వివరించినట్లు ధర్మేంద్రప్రధాన్ తెలిపారు.  ఆర్టికల్ 370 రద్దు ఆవశ్యకతపై చర్చించినట్లు స్పష్టం చేశారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో రాష్ట్రాలు కలిసి నడవాలని సూచించారు. 

లోక్‌సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో సరికొత్త ట్రెండ్ కనిపించిందని స్పష్టం చేశారు. తెలంగాణ, బెంగాల్‌, ఒడిశాలో బీజేపీ విజయకేతనం ఎగరేసిందని గుర్తు చేశారు. కేంద్ర ఆవాస్‌ యోజనను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో పేదలకు ఇళ్లు అవసరంలేదా? అని నిలదీశారు. ఆయుష్మాన్‌ భారత్‌ కూడా తెలంగాణలో అమలుకావడంలేదని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. తెలంగాణలో రాజకీయం శరవేగంగా మారుతోందని చెప్పుకొచ్చారు. బీజేపీ రోజురోజుకు మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు.