Asianet News TeluguAsianet News Telugu

16 ఎంపీ స్థానాలు గెలిస్తే ప్రధాని అయిపోతారా..:కేసీఆర్ పై బీజేపీ విసుర్లు

కేబినెట్ లేకపోవడంతో రాష్టంలో పాలన స్తంభించిపోయిందని , వందల కొద్దీ ఫైల్స్ పేరుకుపోతున్నాయని ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తోన్న ఫసల్ భీమా యోజన పథకం ప్రవేశపెట్టనందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 

bjp state president laxman satires on telangana cm kcr
Author
Hyderabad, First Published Feb 13, 2019, 3:29 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో గెలుపొందుతుందని ఆ పార్టీ నేతలు ఊహాల్లో తేలుతున్నారని విమర్శించారు. 16 ఎంపీలు గెలిచినంత మాత్రాన కేసీఆర్ ఏమైనా ప్రధానమంత్రి అయిపోతారా అని ప్రశ్నించారు. 

కేబినెట్ లేకపోవడంతో రాష్టంలో పాలన స్తంభించిపోయిందని , వందల కొద్దీ ఫైల్స్ పేరుకుపోతున్నాయని ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తోన్న ఫసల్ భీమా యోజన పథకం ప్రవేశపెట్టనందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి బీజేపీ సిద్ధమైందని తెలిపారు. ఫిబ్రవరి నెలలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తారని తెలిపారు. అలాగే మార్చి నెలలో అన్ని రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తారని వెల్లడించారు. 

మనకీ బాత్-మోదీకే సాత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మేరా పరివార్-బీజేపీ పరివార్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతీ కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. 

అదేవిధంగా కమల్ జ్యోతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో దీపాలను వెలిగిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలాది మందితో బైక్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు లక్ష్మణ్ ప్రకటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios