హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఇంటర్ పరీక్ష ఫలితాల అవకతవకలపై విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను కేసీఆర్‌ ఆగం చేశారంటూ ఆరోపించారు. 

ఇంటర్ పరీక్షల నిర్వహణ గ్లోబరీనా అనే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 

గందరగోళానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బాధ్యతగల సీఎంగా కేసీఆర్ స్పందించాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. ఈ వ్యవహారానికి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బాధ్యుడిగా చేస్తూ బర్తరఫ్‌ చెయ్యాలని డిమాండ్ చేశారు. 

విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేవరకు పోరాడతామని హెచ్చరించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 28న బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష చేపడతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.