కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి ఇంకా సమావేశానికి రాకముందే టీ న్యూస్, తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ పత్రికల ప్రతినిధులను వెళ్లిపోవాలని బీజేపీ పంపించింది. ఇది తెలంగాణ మీడియాను అవమానించడమేనని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. 

హైదరాబాద్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో మూడు రోజుల పర్యటన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె రాజధాని నగరం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యే షెడ్యూల్ ఉన్నది. ఈ సమావేశాన్ని కవర్ చేయడానికి దాదాపు అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల ప్రతినిధులు వెళ్లారు. కానీ, ఈ సమావేశంలో విలేకరులకు అవమానం జరిగింది. మరికాసేపట్లో మీడియాతో మాట్లాడటానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వస్తున్నారనగా.. బీజేపీ నేతలు ఓ వివాదానికి తెర లేపారు. కొన్ని మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులను అక్కడి నుంచి వారు బలవంతంగా పంపించేశారు. 

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశాన్ని కవర్ చేయకుండా వెనక్కి పంపిన వారిలో టీ న్యూస్ చానెల్, తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ పత్రిక విలేకరులు ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అనవసరమైన ప్రశ్నలు వేసి విసిగించడం, అర్థం పర్థం లేని రాద్ధాంతం చేసే కొన్ని మీడియా సంస్థలకు చెందిన విలేకరులను తాము మర్యాదపూర్వకంగా వెళ్లిపోవాలని చెప్పినట్టు ఆయన వివరించారు.

కాగా, ఈ ఘటనను విలేకరులు ఖండించారు. రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రి హోదాలో పర్యటిస్తున్నారని, కేంద్రమంత్రి హోదాలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా బీజేపీ నేతలు హద్దుమీరి ప్రవర్తించారని, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం పేర్కొంది. ఇది తెలంగాణ మీడియాను అవమానించడమేనని, మీడియా స్వేచ్ఛను హరించడమేనని అభిప్రాయపడింది.

కేంద్రమంత్రి మీడియా సమావేశం నుంచి టీ న్యూస్, తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ పత్రికల ప్రతినిధులను బయటకు వెళ్లాలని బహిరంగంగా చెప్పటం రాష్ట్ర మీడియాను అవమానించినట్టేనని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, టేంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్‌లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరవ్వాలని గ్రూప్ మెస్సేజీల ద్వారా ఆహ్వానించి తీరా వచ్చిన తర్వాత బయటకు వెళ్లాలని అగౌరవపరచడం జాతీయ పార్టీగా బీజేపీకి తగదని అన్నారు. ఈ ఘటనపై పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.