హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉరి తాడుగా మారుతోందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. అయోధ్యపై చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చిన నవంబర్ 9వ తేదీ చరిత్రలో నిలిచిపోతోందన్నారు.

ఆదివారం నాడు డాక్టర్ లక్ష్మణ్ హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కార్మికులకు కచ్చితంగా తగులుతోందన్నారు. 

చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి ప్రభుత్వం ఆంక్షలు విధించటాన్ని ఖండిస్తున్నాను. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి నక్సల్స్ మద్దతు ఉందన్న పోలీస్ ఉన్నతాధికారుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా లక్ష్మణ్ చెప్పారు.

అయోధ్యలో వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన స్పందించారు.శతాబ్ధాల సమస్యకు సుప్రీంకోర్టులో పరిష్కారం లభించటంతో న్యాయ వ్యవస్థపై గౌరవం మరింత పెరుగుతోందన్నారు.

ఇరు వర్గాలకు న్యాయం చేసేలా సుప్రీం తీర్పు ఉందన్నారు.రాంమందిర్ నిర్మాణం చేపట్టడమే కేంద్రం ముందున్న లక్ష్యమన్నారు. దేశ ప్రధానిగా మోడీ ఉండడం భారతదేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆయన చెప్పారు. 

 సుప్రీం తీర్పు.. భారత ప్రజలు, రాజ్యాంగం గెలుపుగా ఆయన అభివర్ణించారు.హైద్రాబాద్ ఎంపీ  అసదుద్దీన్‌కు రాజ్యాంగం, కోర్టుల మీద నమ్మకం లేదన్నారు. దారు సలాం, మెడికల్ కాలేజీ, వివిధ వ్యాపారాలకు ప్రభుత్వమే భూమి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. సున్నీ వక్ఫ్ బోర్డు సైతం సుప్రీం తీర్పును స్వాగతించింది.