సంగారెడ్డి:తెలంగాణ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. గతంలో తమ పార్టీకి బలంగా ఉన్న జిల్లాలపై తొలుత కేంద్రీకరించింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి బలం ఉండేది. మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర ఈ జిల్లా నుండి పలు దఫాలు ఎంపీగా విజయం సాధించారు. 

తెలంగాణ రాష్ట్రంలో 2023 నాటికి అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పలు పార్టీలకు చెందిన నేతలకు బీజేపీ వల వేస్తోంది.

టీడీపీ, కాంగ్రెస్ నేతలతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలకు కూడ బీజేపీ గాలం వేస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సంగారెడ్డి జిల్లాపై బీజేపీ నేతలు ప్రస్తుతం కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి సత్తయ్య గెలుపొందారుఆ తర్వాత 20 ఏళ్లయినా ఆ జిల్లాలో బీజేపీ తన ఉనికి చాటుకోలేకపోయింది.

ఆ తర్వాత చాలా కాలం పాటు జిల్లాలో బలోపేతమయ్యేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది  కానీ, ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలో బీజేపీ బలోపేతమయ్యేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ కు మంచి పట్టుంది. సంగారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడ గతంలో బీజేపీలో పనిచేశాడు. జగ్గారెడ్డి బీజేపీ నుండి టీఆర్ఎస్ లో చేరాడు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు.

మాజీ కేంద్ర మంత్రి ఆలే నరేంద్ర  అనుచరుడిగా జగ్గారెడ్డి రాజకీయాల్లో కొనసాగారు. నరేంద్రతో పాటు బీజేపీని వీడి నరేంద్ర టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఉమ్మడి మెందక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కూడ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. 

కొందరు కీలక నేతలు కూడ గతంలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారంం సాగింది. అయితే కొన్ని కారణాలతో ఈ చేరికలు ఆగిపోయాయయి. మరోసారి ఆ నేతలతో బీజేపీ నాయకత్వం మరోసారి చర్చలు జరుపుతోందని సమాచారం.  ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలను  తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా ఇతర పార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.