తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు గురువారం నాడు విడుదల చేసిన కార్టూన్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ కార్టూన్ పట్ల బీజేపీ, ఎంఐఎం నేతలు మండిపడుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు గురువారం నాడు విడుదల చేసిన కార్టూన్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ కార్టూన్ పట్ల బీజేపీ, ఎంఐఎం నేతలు మండిపడుతున్నారు.
ఎన్నికల కమిషన్ తీరుపై నిరసన వ్యక్తం చేసే పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతలు విడుదల చేసిన ఈ కార్టూన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంక గాంధీ ఒప్పుకొంటారా అని బీజేపీ ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
తెలంగాణలో ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు కార్టూన్‌ను విడుదల చేసిందిమహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని పోలి ఉన్న కార్టూన్‌ను విడుదల చేశారు. ద్రౌపది రూపంలో ఉన్న వారిని తెలంగాణలో ఉన్న ఓటర్లుగా, వస్త్రాపహరణం చేస్తున్నవారిని ఎన్నికల అధికారులుగా చూపారు.
ఈ తతంగాన్ని కేసీఆర్, ఎంఐఎం నేత అసదుద్దీన్ చూస్తున్నట్టుగా ఈ కార్టూన్ లో చూపారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాలను నిండు సభలో తొలగించేందుకు కౌరవులు చేసిన ప్రయత్నాలను పోలి ఉండేలా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్టూన్ ను విడుదల చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక సమర్ధిస్తారా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు.
ఈ కార్టూన్‌ను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడ తప్పుబట్టారు.ఈ కార్టూన్ మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరించినట్టుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సోనియా, ప్రియాంక, రాహుల్‌గాంధీలతో ఇదే తరహాలో కార్టూన్ వేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారని ఓవైసీ ప్రశ్నించారు.
తాను సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తానని ఆయన చెప్పారు. తమ హక్కుల కోసం తమ నిరసనను ప్రకటించే క్రమంలో ఈ తరహాలో అభ్యంతరకరమైన కార్టూన్లు ప్రదర్శించడం సరైంది కాదన్నారు. ఈ కార్టూన్ మహిళలను అవమానపర్చేదిగా ఉందని ఓవైసీ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాత్రం ఈ కార్టూన్‌ను హిందూవుల మనోభావాలను కించపర్చేలా తయారు చేయడం తమ ఉద్దేశ్యం కాదన్నారు. ఈ కార్టూన్‌పై బీజేపీ, ఎంఐఎం చేసే విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
తాను కూడ హిందూవునేనని ఆయన ప్రకటించారు. హిందూవుల సెంటిమెంట్లను అగౌరవపర్చేలా తాము ఏనాడూ కూడ ప్రవర్తించలేదని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యేలా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని కార్టూన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.కానీ, ఏ ఒక్కరి మనోభావాలకు వ్యతిరేకంగా పని చేయలేదన్నారు.
