హైదరాబాద్: టీఆర్ఎస్‌ను ఇక నుండి ప్రతిక్షణం వెంటాడుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు.  రానున్న రోజుల్లో ప్రతిపక్షం ఎలా ఉంటుందో టీఆర్ఎస్ కు రుచి చూపిస్తామని  ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు లేదని మురళీధర్ రావు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంగా పోరాటం చేయడమంటే ఏమిటో చూపిస్తామని ఆయన చెప్పారు.

కర్ణాటకలో తమ లక్ష్యం పూర్తైందని... ఇక రేపటి టార్గెట్ తెలంగాణే అంటూ మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  రానున్న రోజుల్లో  తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని  ఆయన స్పష్టం చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆరోపించారు. కర్ణాటక అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని  ఆయన హామీ ఇచ్చారు.సోమవారం నాడు కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప బలాన్ని నిరూపించుకొన్న విషయం తెలిసిందే.