వరంగల్: కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చట్ట విరుద్దంగా ప్రవర్తిసున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.

పరకాలలో ఆదివారం నాడు నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఎవరి రిజర్వేషన్లను కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తారో  కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు  తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు 51 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తన కొడుకులు, కూతుళ్లను  గెలిపించేందుకే  ముందస్తు ఎన్నికలను కేసీఆర్  తీసుకొచ్చాడన్నారు.మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏడురెట్ల నిధులను  మంజూరు చేసిందన్నారు.

యూపీఏ ప్రభుత్వం  ఉమ్మడి ఏపీకి అరకొర నిధులు ఇస్తే  ఎన్డీఏ  ప్రభుత్వం  తెలంగాణకు  అదనంగా నిధులను  ఇచ్చినట్టు  ఆయన తెలిపారు.పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని అమిత్ షా ఆరోపించారు.

ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడిందన్నారు.మిగులు రెవిన్యూ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలనలో  అప్పుల్లోకి నెట్టారని అమిత్ షా విమర్శించారు.

గత ఎన్నికల్లో ప్రజలకు అనేక  హమీలను ఇచ్చిన కేసీఆర్  ఏ ఒక్కటి కూడ అమలు చేయలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్  ఎందుకు తెలంగాణకు దళితుడిని సీఎం చేయలేదో చెప్పాలన్నారు. భవిష్యత్తులో  దళితుడిని సీఎం చేస్తానని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే తాము సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... ఓవైసీకి భయడపడే  కేసీఆర్  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మాత్రం  నిర్వహించడం లేదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిష్టులు కనుమరుగు అవుతున్నారు, దేశంలో కూడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతోందని అమిత్ షా చెప్పారు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కూటమిని ఏర్పాటు చేసి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  ప్రత్యామ్నాయమని చెప్పుకోవడాన్ని  ఆయన తప్పుబట్టారు. టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పారు.

సంబంధిత వార్తలు

ఐదో లిస్ట్: 19 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే