హైదరాబాద్: తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూటమికి నాయకుడు లేరన్నారు. అలాంటి కూటమిని  ప్రజలు నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేవైఎం ఆధ్వరంలో ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యువభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మజ్లిస్ భయంతోనే  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా తెలంగాణ అమరవీరులను టీఆర్ఎస్ అవమానపర్చిందని అమిత్ షా ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమాల గడ్డని అని ఆయన ప్రస్తుతించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. అంతేకాదు రజాకార్ల దాడుల్లో భారత సైనికులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టారని ఆయన గుర్తు చేశారు. 

 నాలుగున్నర ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన బీజేవైఎం కార్యకర్తలను కోరారు.  ఇవాళ్టి నుండి  పోలింగ్ వరకు  బీజేవైఎం కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన సూచించారు.

నాలుగు తరాల్లో చేయని పనులను నాలుగేళ్లలో పూర్తి చేసినట్టు అమిత్ షా గుర్తు చేశారు. నాలుగేళ్లలో ఏం చేశామో  ప్రజలకు తెలుసునని అమిత్ సా చెప్పారు. ప్రజలకు  ఏం చేశారని రాహుల్ గాంధీ అడగడాన్ని ఆయన తప్పుబట్టారు. 

మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని  ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని  ఆయన గుర్తు చేశారు.  మోడీ నాయకత్వంలో దేశంలో  అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు.  బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు మోడీకి లేదని అమిత్ షా చెప్పారు.2019లో మరోసారి మోడీ ప్రధానమంత్రిగా ఎన్నిక అవుతారని అమిత్ షా జోస్యం చెప్పారు.