ఎంపీ ల్యాడ్స్ నిధులను తన సొంత అవసరాల కోసం వాడుకున్నానంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేసారు. అభివృద్ది పనుల కోసం ఖర్చుచేయాల్సిన నిధులను తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నానని స్వయంగా ఎంపీయే ఒప్పుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో కొంత మొత్తం కొత్తగా నిర్మించుకున్న ఇంటికోసం వాడుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇటీవల జరిగిన కొడుకు పెళ్లి ఖర్చులను ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి వాడుకున్నట్లు సోయం బాపురావు స్వయంగా వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బిజెపి నేతల సమావేశంలో ఎంపీ బాపురావు పాల్గొన్నారు. ఆ సందర్భంగా గతంలో ఎంపీలుగా పనిచేసినవారు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు బిజెపి ఎంపీ ఆరోపించారు. అభివృద్ది కోసం కేటాయించిన నిధులను ఎంపీలు దుర్వినియోగం చేసేవారని... మొత్తం నిధులను స్వాహా చేసేవారని ఆరోపించారు. కానీ తాను అలా కాదని... కొన్ని నిధులను మాత్రమే సొంత అవసరాలకు వాడుకున్నానంటూ బహిరంగంగానే ఒప్పుకున్నారు.
తెలంగాణ బిజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కంటే తనకే ఎక్కువ నిధులు వచ్చాయని బాపురావు తెలిపారు. ఇప్పటికే పలు అభివృద్ది పనులు, సొంత అవసరాలకు కొంత ఖర్చయ్యిందని... మిగిలిన నిధులను కార్యకర్తలందరికీ సమంగా కేటాయిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని గెలిపించుకునేందుకు ప్రతిఒక్కరు శక్తివంచన లేకుండా కష్టపడాలని సోయం బాపురావు సూచించారు.
Read More అది చెప్పకపోతే ప్రజలు నమ్మరు.. పీసీసీ సర్వేపై విజయశాంతి మండిపాటు..
అయితే ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంత ఖర్చులకు వాడుకున్నానన్న బిజెపి ఎంపీ బాపురావు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అభివృద్ది కోసం ఉపయోగించాల్సిన నిధులను సొంతానికి వాడుకున్నానని స్వయంగా ఎంపీ ఒప్పుకున్నారు....కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే ఎంపీ బాపురావును ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు.
ఇక ప్రతిపక్షాల నాయకులనే కాదు బిజెపి నాయకులను సైతం ఎంపీ బాపురావు వ్యాఖ్యలు షాక్ కు గురిచేసాయి. ఇలా బహిరంగంగానే ఎంపీ ల్యాడ్స్ నిధులు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నానని అన్న బాపురావు వ్యాఖ్యలపై బిజెపి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
