ఆదిలాబాద్: ఫారెస్ట్ అధికారులపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ అధికారులు పోడుభూముల జోలికి వస్తే అడ్డం పడండి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా మెుక్కలు నాటే పోరుతో పోడు భూముల జోలికి వస్తే తరిమికొట్టండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 

హరితహారం పేరుతో పోడు భూముల్లో చెట్లు నాటితే ఊరుకోవద్దని పీకిపాడేయాలంటూ స్పష్టం చేశారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల జోలికి ఫారెస్ట్ అధికారులు వస్తే తన్నండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 

డిసెంబర్ 9న ఆదివాసీల హక్కుల కోసం ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదివాసీలకు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆదివాసీల హక్కులు కాపాడాలంటే ప్రతీ ఒక్కరూ పోరాటం చేయాలని ఎంపీ సోయం బాపూరావు సూచించారు. 

ఇకపోతే ఇటీవలే కొమరంభీం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన మరువక ముందే బీజేపీ ఎంపీ బాపూరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

ఇటీవలే కొమరంభీం జిల్లాలోని సిర్సాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయ అటవీకరణ పనులను పర్యవేక్షించేందుకు అటవీ రేంజ్ ఆఫీసర్ అనిత, తన సిబ్బందితో కలిసి వెళ్లారు.
అయితే వీరిని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోనేరు కృష్ణ వందలాది మంది సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అనితతో పాటు సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.