రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు

రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జేపీని, ప్రధాని మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో మూడేళ్లుగా నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టుల సహకారంతోనే మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కమ్యూనిస్టుల పరిస్థితి కొబ్బరి చిప్ప కోతికి దొరికినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 

ప్రధాని మోదీ ఈ నెల 11,12 తేదీల్లో ఏపీ, తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. ఇందులో భాగంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. మోడీ ఎరువుల కర్మాగారం ప్రారంభిస్తే కేసీఆర్‌కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగమిస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలనను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధాని తెలంగాణ పర్యటనపై రాజకీయ రగడ మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ ప్రకటించింది. మరోవైపు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థుల జేఏసీ.. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకు ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తోంది. లేకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటన అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించింది.