బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. దేశాన్ని దోచుకోవడానికి కేంద్రంలో తెలంగాణ తరహా పాలన తీసుకొస్తారా అని కేసీఆర్‌ను  ప్రశ్నించారు. 

బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. దేశాన్ని దోచుకోవడానికి కేంద్రంలో తెలంగాణ తరహా పాలన తీసుకొస్తారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పాలన పట్ల విసిగిపోయారని అన్నారు. కేసీఆర్‌కు షిండే, డబుల్ ఇంజన్ సర్కార్ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 

అభివృద్ది, సంక్షేమం అజెండాతో మోదీ పాలన సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా, డ్రగ్స్ మాఫీయా అడ్డగా మార్చారని ఆరోపించారు. అలాంటిది దేశాన్ని మీరు మారుస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని చాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తిడుతుంటే ప్రజలు ఊరుకోరన్నారు.

దేశంలో తెలంగాణ తరహా పాలన కాదని.. తెలంగాణలోనే యూపీ తరహా పాలన తీసుకొస్తామని చెప్పారు. ఎంపీగా తనకు అవకాశం ఇస్తే కేసీఆర్‌కు ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఒక ఆదీవాసి బిడ్డకు రాష్ట్రపతి అవకాశం ఇస్తున్న ప్రధాని మోదీ ఎక్కడ.. పోడు భూముల గురించి ఆదీవాసిలపై దాడులు చేస్తున్న మీరెక్కడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. మోదీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. మిషన్ తెలంగాణ రోడ్ మ్యాప్ సిద్దం అవుతుందని చెప్పారు. కేసీఆర్ ఫైటర్ కాదని.. చీటర్ అని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ సిద్దంగా ఉందని అన్నారు.