Asianet News TeluguAsianet News Telugu

బిజెపిలోకి తెలంగాణ సీఎం రేవంత్..? సాదర స్వాగతం : ధర్మపురి అరవింద్ 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా వుంటుంది? కేటీఆర్ అంటున్నట్లు ఆయన బిజెపిలో చేరతారా ?  ఈ ప్రచారంపై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమంటున్నారు?... అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది....

BJP MP Dharmapuri Arvind reacts on  Telangana CM Revanth Reddy BJP Joining AKP
Author
First Published Apr 15, 2024, 12:35 PM IST

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత బిజెపిలో చేరతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా రేవంత్, బిజెపి అనుభందంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ సాగుతున్న వేళ నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఏకంగా టిపిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బిజెపిలోకి ఆహ్వానించారు అరవింద్. గతంలో కేటీఆర్, ఇప్పుడు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఒకేలా వుండటంతో తెరవెనక బిజెపి ఏమైనా గేమ్ ప్లాన్ చేస్తోందా అన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో మొదలయ్యింది. 

ధర్మపురి అరవింద్ ఏమన్నారంటే :  

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో వస్తానంటే తాను సాదరంగా ఆహ్వానిస్తానని ధర్మపురి అరవింద్ తెలిపారు. ఆయనకు ఓ స్నేహితుడిగా పార్టీలో చేరేందుకు సహకరిస్తానని బిజెపి ఎంపీ పేర్కొన్నారు. అయితే రేవంత్ ను బిజెపిలో చేర్చుకోవాలో, వద్దో అన్నది బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చూసుకుంటారన్నారు. కానీ రేవంత్ ను పార్టీలో చేర్చుకోవాలని మాత్రం రికమెండ్ చేస్తానని అన్నారు.  

ఈ సందర్భంగా రేవంత్ ను అరవింద్ ప్రశంసించారు. రాజకీయంగా యాక్టివ్ గా వుండే రేవంత్ లాంటి నాయకుడు బిజెపిలో చేరితే మంచిదేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధుడు కాదు... కాంగ్రెస్ ప్రభుత్వం  అసర్థమైనదని అన్నారు.  ఒకవేళ రేవంత్  కాంగ్రెస్ లోనే కొనసాగితే మరింత అసమర్థుడు అవుతాడన్నారు... అక్కడ ఆయనను పనిచేసుకోనివ్వరని అరవింద్ అన్నారు. మీ రాజకీయ భవిష్యత్ ను నాశనం  చేసుకోవద్దంటూ రేవంత్ కు సూచించారు అరవింద్. తొందరగా ఓ నిర్ణయం తీసుకోకుంటే రేవంత్ కూడా మరో రాజ్ పాల్ యాదవ్ అవుతారని బిజెపి ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

 

అరవింద్ మాటల్లో అంతరార్థం ఇదేనా..? 

బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వున్న వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడే అవకాశం వుండదు. అయితే పొలిటికల్ గా తమకు ప్లస్ అవుందని భావిస్తేనో... లేక నిజంగానే రేవంత్ బిజెపిలో చేరతారనే సమాచారం వుంటేనో ధర్మపురి అరవింద్ ఇలా మాట్లాడివుంటారు. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన, ఎన్సిపి లను చీల్చినట్లే తెలంగాణ కాంగ్రెస్ ను చీల్చే ఆలోచన ఏమైనా బిజెపి వుందా? ఆ దిశగా పావులేమైనా కదుపుతున్నారా? అన్న అనుమానం అరవింద్ కామెంట్స్ తర్వాత ప్రజల్లో మెదులుతోంది. 

తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగానే ముఖ్యమంత్రి పదవికోసం సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు కూడా ప్రయత్నించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి గెలిపించిన రేవంత్ రెడ్డిని సీఎం చేసింది అదిష్టానం. సీఎం పదవి ఆశించిన సీనియర్లకు కీలకమైన మంత్రిత్వ శాఖలు అప్పగించారు.  

అయితే మంత్రి పదవులతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ను గద్దెదించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం రేవంత్ తన కేబినెట్ లోని మంత్రులపైనే నిఘా వుంచినట్లు కేటీఆర్ లాంటివారు అంటున్నారు. ఉత్తమ్, భట్టి, పొంగులేటి వంటి మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాపింగ్ చేయిస్తున్నారంటూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్ చేసారు. ఇలా కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలే రేవంత్ ను పార్టీ మార్పు దిశగా నడిపిస్తున్నాయన్నది కేటీఆర్ మాటల సారాంశం. రేవంత్ బిజెపిలో చేరతారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కు అరవింద్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. 

రేవంత్ కు బిజెపితో అనుబంధం : 

రేవంత్ రెడ్డి రాజకీయాల వైపు అడుగు వేసిందే బిజెపి వైపునుండి. బిజెపి అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబివిపి) నుండే రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది.  కొంతకాలం ఏబివిపిలో పనిచేసాక ఆనాటి టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) లో కొంత కాలం పనిచేసారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ప్రజా ప్రతినిధిగా, ఎమ్మెల్సీగా, టిడిపి ఎమ్మెల్యేగా పనిచేసారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన రేవంత్ తెలంగాణ ఏర్పాటుతర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరారు. 

అయితే టిడిపిని వీడే సయంలోనూ రేవంత్ బిజెపిలో చేరతారంటూ ప్రచారం జరిగింది. బిజెపి నాయకులు కూడా రేవంత్ తో సంప్రదింపులు జరిపారు. గతంలో బిజెపితో వున్న అనుబంధాన్ని గుర్తుచేసి తమవైపు లాక్కోవాలని ప్రయత్నించారు. కానీ రేవంత్ కేంద్రంలో అధికారంలో వున్న బిజెపిని కాదని కష్టకాలంలో వున్న కాంగ్రెస్ లో చేరారు. 

ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అంటూ రేవంత్ అనడం కూడా ఆయన బిజెపిలో చేరిక ప్రచారానికి బలం చేకూరుస్తోంది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అదిష్టానం మోదీ, బిజెపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే రేవంత్ మాత్రం ప్రధానితో సఖ్యతగా వుండేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసమే తాను ప్రధానిని పెద్దన్న అన్నట్లు రేవంత్ వివరణ ఇచ్చినా కేటీఆర్, అరవింద్ మాటలతో ఎక్కడో డౌట్ కొడుతోంది. రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతారన్న ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేయలేడానికి లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios