నా భార్య తలనరికి బహుమతిగా ఇస్తామని బెదిరింపులు..: బండి సంజయ్ సంచలనం
తన భార్య తలనరికి బహుమతిగా ఇస్తామని... కొడులను కిడ్నాప్ చేస్తానని తనను బెదిరించారని బిజెపి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మాటల తూటాలు పేలుతున్నాయి. కేవలం ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులపై విమర్శలే కాదు ప్రజలను ఆకట్టుకునే ప్రసంగిస్తూ ప్రచార హోరు పెంచుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఇలా కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలిచిన బిజెపి ఎంపీ బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా తాను ఎలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నది తాజాగా కరీంనగర్ ప్రజలకు వివరించాడు సంజయ్.
హైదరాబాద్ చార్మినార్ వద్ద బిజెపి సభ పెడితే తన భార్యను చంపేస్తామని... కొడుకులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని సంజయ్ వెల్లడించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో బిజెపి బలోపేతం చేయాలనే ధైర్యంగా పాతబస్తీలో సభ పెట్టానని అన్నారు. అందువల్లే ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా సక్సెస్ ఫుల్ గా పాతబస్తీలో సభ నిర్వహించామని అన్నారు. ఇలా పార్టీకోసం ధైర్యంగా ముందుకు వెళ్లిన చరిత్ర తమదని బండి సంజయ్ అన్నారు.
పాతబస్తీలో బిజెపి సభ పెట్టాలనే ఆలోచన విమరించుకోవాలని... లేదంటే తన భార్య తల నరికి గిప్ట్ గా ఇస్తామని కొందరు బెదిరించారని సంజయ్ తెలిపారు. అంతేకాదు తన కొడుకులను, కుటుంబసభ్యులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని తెలిపారు. ఏ బెదిరింపులకు భయపడుకుండా పాతబస్తీ చార్మినార్ ఎదుటే బిజెపి సభ విజయవంతంగా నిర్వహించామని సంజయ్ తెలిపారు.
Read More ఎన్నికలు రాగానే అన్నదమ్ముల పంచాయితీ పోయి.. మామ అలుళ్లు అయ్యారు: బీఆర్ఎస్, ఎంఐఎంలపై బండి ఫైర్
తనలాగే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఎందరో బెదిరించారని... చంపేస్తామని భయపెట్టినా అతడు హిందూధర్మం కోసం పోరాటం ఆపలేదని అన్నారు. ఈ ధర్మపోరాటంలో ఏడాదిపాటి బిజెపికి దూరం కావాల్సి వచ్చిందన్నారు. పార్టీకి దూరమైనా... జైల్లో పెట్టినా రాజాసింగ్ ఏనాడూ అధైర్యపడలేదని... ధర్మంకోసం పనిచేసాడని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే ఈసారి కరీంనగర్ లో అసెంబ్లీలో కాషాయ జెండా ఎగరబోతోందని సంజయ్ అన్నారు. ఒక్క కరీంనగర్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ప్రభంజనం ఖాయమని... అధికారం కాషాయ పార్టీదేనని ధీమా వ్యక్తం చేసారు. గెలుపుపై పూర్తి నమ్మకం వుందికాబట్టే బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ముందుగానే ప్రకటించినట్లు సంజయ్ తెలిపారు. పేద బడుగుబలహీన వర్గాల బాధలు తెలిసిన బిసి నాయకుడు సీఎం అయితే రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్నారు.
తెలంగాణలో బిజెపి బలంగా వుందని సంజయ్ అన్నారు. ఇప్పటికే పార్టీ నాయకులంతా ప్రజల్లోకి వెళుతున్నారని... కేంద్ర నాయకులతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు పార్టీ నాయకత్వం ప్రణాళిక రూపొందిస్తోందని బండి సంజయ్ వెల్లడించారు.