కరీంనగర్: కరోనా పరిస్థితులపై అనవసర అపోహలతో భయాందోళనకు గురి కావద్దని... మనోధైర్యానికి మించిన మందు లేదని కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ స్థితిగతులపై గురువారం జిల్లా కలెక్టర్ శశాంకతో ఎంపీ సంజయ్ చర్చించారు. కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కరోనా బాధితులు జిల్లా కేంద్రానికి అధికంగా వస్తున్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎంపీ జిల్లా కలెక్టర్ కు సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్, రెమిడిసివిర్, ఇతర ఔషధాల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ ను ఎంపీ కోరారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్  విషయంలో ఎలాంటి సహాయ సహకారాలైన అందించడానికి సిద్ధంగా ఉందని... అందుకు జిల్లా యంత్రాంగం, ఆరోగ్యశాఖ తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. తన పరిధిలో ఉండే అంశాలను తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు.

read more   18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేం: తేల్చిచెప్పిన ఈటల

కరోనా పట్ల అవగాహనతో ఉండాలి తప్ప, అనవసర ఆలోచనలతో, అపోహలతో భయభ్రాంతులకు గురికావద్దని ప్రజలకు ఎంపీ సూచించారు. కరోనా పట్ల కొన్ని తప్పుడు ప్రచారాలతో సామాన్య ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారని... ఈ కథనాల వల్ల కరోనా నుంచి కోలుకోగలిగే వారూ అనవసర ఆందోళనతో పరిస్థితిని మరణం వరకు తెచ్చుకుంటున్నారని అన్నారు. మరికొందరు కరోనా బాధితులు, వైద్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా తమ తమ సొంత వైద్యంతో విషమ పరిస్థితులు తెచ్చుకుంటున్నారని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

అవగాహనా రాహిత్యంతోనే కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. కరోనా లక్షణాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యశాఖ, వైద్యుల సలహా సూచనల మేరకే నడుచుకోవాలని ఆయన కోరారు. హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రిలో ఉన్న కరోనా బాధితులు మనోధైర్యం కలిగి ఉండాలని, కరోనా వ్యాధిని జయించి తీరుతామనే సంకల్పం కలిగి ఉండాలని ఎంపీ సూచించారు. అలాగే, ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని బండి సంజయ్ కుమార్ కోరారు.