కాళ్లు పట్టుకునే నేతలతో జాగ్రత్తగా ఉండాలని, వాళ్లు కాళ్లు పట్టుకోవడంతో పాటు అవసరమైతే కాళ్లు కూడా లాగేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ...ఆయన మొదటిసారిగా తెలుగులోనే మాట్లాడి ఆకట్టుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తాను తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తెలుగు బాగా నేర్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు సూచించారని.. గవర్నర్ ప్రసంగం బాగుందని, కొన్ని అంశాల్లో తనకు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు.

సభలో గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలి కానీ కొందరు ఎమ్మెల్యేలు రాజకీయాల గురించి మాట్లాడారన్నారు. ఏ పార్టీ వ్యక్తి సీఎంగా ఉంటే ఆయన కాళ్లు పట్టుకునే నేతలు కొందరున్నారని, చంద్రబాబు మొదలుకొని వైఎస్, కిరణ్‌ల కాళ్లుపట్టుకున్న వారు ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయితే అలాంటి వారిపట్ల సీఎంలు జాగ్రత్తగా ఉండాలని, వాళ్లు కాళ్లు పట్టుకోవడంతో పాటు కాళ్లు గుంజే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ కిట్ పథకం బాగుందని, అందులో రాష్ట్ర వాటా ఎంత..? కేంద్ర వాటా ఎంత..? అనే వివరాలు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఉస్మానియ ఆసుపత్రి భవనం కూలిపోయే పరిస్థితి నెలకొందని, కొత్త భవనం కట్టించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కంటివెలుగు పథకంలో ఎంతమందికి ఆపరేషన్లు అవసరం అనేది చెప్పలేదని, అనేకమంది అద్దాల కోసం తిరుగుతున్నారని రాజాసింగ్ తెలిపారు.

పెన్షన్లు కొందరికి రావడం లేదని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌లో పెళ్లయిన తరువాత రెండేళ్లకు చెక్‌లు వస్తున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. డ్రగ్స్‌ కేసులో ఎంతమంది సెలబ్రిటీలపై కేసులు పెట్టారు..? ఎంతమందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారో ప్రభుత్వం చెప్పాలన్నారు.