వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో  పురోగతి చోటు చేసుకొంది. ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా ఫాం హౌస్ ఇంచార్జీ ఉమర్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్ కు తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ కాల్పుల ఘటనపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆవుపై కాల్పులు జరిగిన సమయంలో సానియా అక్కడే వున్నారని... ఆమే ఈ కాల్పులకు తెగబడ్డారని గ్రామస్తులు చెబుతున్నారని రాజాసింగ్ అన్నారు. గతంలోనూ సానియా ఓ నెమలిని కూడా ఇలాగే చంపినట్లు గ్రామస్తులు చెబుతున్నారన్నారు. కాబట్టి గోమాతపై జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపి అసలు నిందితులను శిక్షించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. 

ఐదు రోజుల క్రితం భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు చెందిన ఫాం హౌస్ సమీపంలో మేత కోసం వచ్చిన పశువుకు బుల్లెట్ గాయమై మరణించింది. ఈ ఘటన తర్వాత ఈ ప్రాంతానికి రావొద్దని పశువుల కాపరులను ఓ వ్యక్తి హెచ్చరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు సానియాకు చెందిన ఫాం హౌస్ ఇంచార్జీ ఉమర్ ను అరెస్ట్ చేశారు. 

నిందితుడికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు. స్వాధీనం చేసుకొన్న బుల్లెట్ ను నిందితుడు ఉపయోగించిన రివాల్వర్ నుండే వచ్చిందా? అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.