సారాంశం
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి రూ.4 వేల కోట్ల మియాపూర్ భూములను అప్పగించారని ఆరోపించారు.
ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తోట చంద్రశేఖర్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి రూ.4 వేల కోట్ల మియాపూర్ భూములను అప్పగించారని ఆరోపించారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే ల్యాండ్ స్కాం జరిగిందని.. ఖమ్మం సభకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాక్షసులుగా కనిపించిన ఆంధ్రా వాళ్లు.. ఇప్పుడు కేసీఆర్‌కు రక్తసంబంధీకులు ఎలా అయ్యారో చెప్పాలని దుయ్యబట్టారు.
తోట చంద్రశేఖర్‌కు మియాపూర్‌లోని 40 ఎకరాల భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర వుందని రఘునందన్ రావు ఆరోపించారు. గతంలో వ్యాపారవేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కలెక్టర్.. మరి చంద్రశేఖర్ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ భూముల విక్రయాల ద్వారా తోట చంద్రశేఖర్‌కు 4 వేల కోట్లు వచ్చాయని.. ఆ కృతజ్ఞతతోనే ఖమ్మం సభకు ఆర్ధిక సాయం చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. భూముల అక్రమాలపై సుప్రీంకోర్టు గడప తొక్కుతామని ఆయన స్పష్టం చేశారు.
Also REad: బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్, రావెలకు ఢిల్లీలో కీలక బాధ్యతలు: కేసీఆర్
ఇదిలావుండగా.. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో రానున్న రోజుల్లో భారీగా పార్టీలో చేరికలు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎందరో కీలక నేతలు కూడా తనకు ఫోన్లు చేస్తున్నారని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత ఏపీ నుండి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కాన్షీరామ్ తో కలిసి పనిచేశారన్నారు. లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగితో కూడా ఆయన పనిచేశారన్నారు. రావెల కిసోరో బాబుతో తాను ఐదు గంటల పాటు చర్చించినట్టుగా కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీ కేంద్రంగా రావెల కిషోర్ బాబు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించి ఆయన బాధ్యతలను అప్పగిస్తానని కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఈ విషయమై పార్టీ ప్రకటన చేయనున్నట్టుగా సీఎం వివరించారు.