కారణమిదీ: హకీంపేటలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ కు వెళ్తున్న రఘునందన్ రావును పోలీసులు హకీంపేట వద్ద అడ్డుకున్నారు.
హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును బుధవారంనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్ కు రఘునందన్ రావు వెళ్తున్న సమయంలో హకీంపేట వద్ద రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గజ్వేల్ లోని శివాజీ విగ్రహన్ని అవమానించేలా వ్యవహరించడం ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో పోలీసులు గజ్వేల్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గజ్వేల్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని కూడ పోలీసులు సూచించారు.గజ్వేల్ లో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు హకీంపేటలో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆయనను అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ రఘునందన్ రావుతో ఫోన్ లో మాట్లాడారు. రఘునందన్ రావును అరెస్ట్ చేయడాన్ని ఈటల రాజేందర్ తప్పు బట్టారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆయన విమర్శించారు.