బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. నిర్మల్ ఆస్పత్రి వద్ద బీజేపీ నేతల ఆందోళన..
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని పీయూసీ-2 చదువుతున్న భాను ప్రసాద్‌గా గుర్తించారు.

నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బాసర ట్రిపుల్ ఐటీలో భానుప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. అయితే సోమవారం ఉదయం మార్చురీలో ఉన్న భానుప్రసాద్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన ఏబీవీపీ, బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకనుని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి, బాసర ట్రిపుట్ ఐటీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఇక,నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న భాను ప్రసాద్ ఆత్మహత్య చేసుకన్నారు. భానుప్రసాద్ రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన వ్యక్తి. ఆదివారం హాస్టల్ గదిలో భానుప్రసాద్ ఉరివేసుకుని వేలాడుతున్నాడని అతని స్నేహితులు చూసి కాలేజ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలను సేకరించారు.
విద్యార్థుల పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతారనే భయంతో పోలీసులు కొద్దిసేపు క్యాంపస్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భానుప్రసాద్ మృతదేహాన్ని క్యాంపస్ నుంచి నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే భానుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కాలేజ్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థి మృతిపట్ల వీసీ వెంకటరమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భానుప్రసాద్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టుగా సమాచారం. అయితే సూసైడ్ నోట్ వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోస్టుమార్టమ్ రిపోర్ట్ కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.